మలక్‌పేట, జూలై 26: ఎనిమిదేండ్ల అంధ బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమశాఖ ఎండీ, రాష్ర్ట కమిషనర్ శైలజ, ఏడీ రాజేందర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) డిమాండ్ చేసింది. శుక్రవారం వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో అంధుల సంఘాలు మలక్‌పేటలోని అంధుల బాలికల వసతిగృహం ఎదుట ఆందోళన చేశాయి.
అఘాయిత్యాన్ని దాచి బాలిక తల్లిని తప్పుదోవ పట్టించిన వార్డెన్‌పై, 15 రోజులుగా విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు, అధికారులపై వికలాంగుల, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. విచారణ కమిటీలో అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని ఉరి తీయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. ఆందోళనలో అంధుల హాస్టల్ విద్యార్థులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు గోపాల్, మౌనిక, అంధులు పాల్గొన్నారు.