G20 | డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వ్యాలెట్ ఓ అద్భుతమని, దాంతో పల్లెలకు బ్యాకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జీ20 దేశాల ఆర్థిక సదస్సులో ఆదివారం జయేశ్ రంజన్ మాట్లాడారు. దేశంలో 2016వ సంవత్సరం పెద్దనోట్ల రద్దు జరిగిందని, అప్పట్లో బ్యాంకుల దగ్గర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
ఆ తర్వాత డిజిటల్ పేమెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల పరిస్థితి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం టీ వ్యాలెట్‌ను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. టీ వ్యాలెట్ దేశంలోనే తొలి డిజిటల్ వ్యాలెట్ అని తెలిపారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లోనూ టీ వ్యాలెట్ అందుబాటులో ఉన్నదని చెప్పారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించిందని తెలిపారు.
బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా, ఆర్థిక లావాదేవీల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు. దాంతో లబ్ధిదారుల సమయం ఆదా అవుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్షిప్, అన్నదాతలకు రైతుబంధు తదితర అనేకం ఎవరితో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా టీ వ్యాలెట్ నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. ఎలాంటి సర్వీస్ చార్జీలు లేకుండానే టీ వ్యాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేవలం ఏడేండ్లలోనే 1.39 మిలియన్ సబ్‌స్ర్కైబర్లు టీ వ్యాలెట్‌కు ఉన్నారన్నారు. 35 మిలియన్ లావాదేవీలు జరిగాయని గుర్తుచేశారు. డిజిటల్ రంగంలో తెలంగాణ టీ వ్యాలెట్ అనేది.. ఓ కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్తోపాటు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.