ముంబై, సెప్టెంబర్ 17: మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు దిగంబర్ విశే సార్ గొప్ప దార్శనికుడని, హెచ్ఎంగా, ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరవలేనిదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి వంశీధర్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎదుగుదలకు ఎంతో దోహదపడిన ఆయన అకాల మరణం తమను ఎంతో వేదనకు గురి చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కొంకణ విభాగ సహా సమన్వయకర్త దిగంబర్ విశే సంస్మరణ సభ ఆదివారం మహారాష్ట్రలోని ముర్బాడ్ తాలుకా కుణిబి సమాజొన్నత మండలి హాలులో జరిగింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తరఫున వంశీధర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని, దిగంబర్ విశేకు శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబానికి పార్టీ బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంస్మరణ సభలో ముర్బాడ్ ఎమ్మెల్యే కిసాన్ కథోరే, మాజీ ఎమ్మెల్యేలు జగన్నాథ్ పాటిల్, ఆర్సీ పాటిల్‌తో పాటు కుణిబి సమాజానికి చెందిన వందలాది మంది పాల్గొన్నారు.