Airport Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ ప్రభుత్వ ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు రద్దు చేస్తాం’.. ‘కాదు కాదు అలైన్మెంట్ మారుస్తాం’.. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్‌పోర్టుకు’.. ఇలా మెట్రో ప్లాన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గానికి రూ.6,250 కోట్ల అంచనాతో కేసీఆర్ సర్కారు పనులు చేపట్టింది. అయితే, ఈ మార్గం కాకుండా బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్‌పోర్టుకు 32 కిలోమీటర్లే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాకపోతే.. ఈ మార్గంలో దూరం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు 32 కిలోమీటర్లు కాకుండా, 40 కిలోమీటర్లపైనే వస్తున్నది.
దూరం పెరిగితే నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ లెక్కన ప్రతి కిలోమీటరుకు రూ.200 కోట్ల చొప్పున రూ.8 వేల కోట్ల వ్యయం అవుతుంది. కానీ, కేసీఆర్ ప్రభుత్వం రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతోనే నిర్మాణ పనులు చేపట్టింది. దీన్ని రద్దు చేసి కొత్త ప్రతిపాదన ప్రకారం వెళ్తే రూ.1,750 కోట్ల వ్యయం పెరుగుతుంది. అలాంటప్పుడు తక్కువ వ్యయంతో ఎలా పూర్తి చేస్తారన్న సందేహం వ్యక్తమవుతున్నది. అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని చెప్పటం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్నదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేర్వేరు మార్గాలను నిర్మిస్తే ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందే తప్ప తగ్గేందుకు అవకాశం ఉండదు.
2050 లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం మెట్రో ప్రణాళిక
హైదరాబాద్ మహానగరంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం కేసీఆర్ ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి, క్షేత్ర స్థాయిలో పనులు సైతం మొదలు పెట్టింది. 2050 లక్ష్యంగా నగరం నలుమూలలా 415 కిలోమీటర్ల దూరంతో మెట్రో మార్గాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ రెడీ చేసింది. వివిధ దశల్లో వాటిని చేపట్టాలని స్పష్టమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి దశ 69 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగుతున్నాయి. రెండో దశలో రాయదుర్గం-ఎయిర్‌పోర్టు (31 కిలోమీటర్లు) ఉండగా, బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ (26 కిలోమీటర్లు), నాగోల్-ఎల్బీనగర్ (5 కిలోమీటర్లు) మార్గాలు ఉన్నాయి. ఇందులో ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం టెండర్లను సైతం పిలిచింది. మూడో దశలో 278 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నలుమూలలా మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి అధ్యయనం చేసి డీపీఆర్‌లు రూపొందించేందుకు కన్సల్టెన్సీలను సైతం నియమించింది.