భూదాన్ పోచంపల్లి, జనవరి 1: భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు సాయిని భరత్ పట్టుచీరను కళాత్మకంగా తయారు చేసి అందరిని అబ్బురపరిచాడు. ఓవైపు కట్టుకుంటే ఒక కలర్, మరోవైపు కట్టుకుంటే మరో కలర్ కనిపిస్తుంది. డిజైన్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. రెండున్నర సంవత్సరాలు శ్రమించి, 15 రోజులపాటు మగ్గంపై చీరను నేశాడు. సాధారణంగా ఒక ఇక్కత్ చీరకు పైమర్ల, కింది మర్ల ఒకటే కలర్, డిజైన్ కనిపిస్తుంది. కానీ ఇది ప్రత్యేకం. ఈ చీరకు ఉల్టా పల్టా ఉండదు. ఈ చీరను తయారు చేసినందుకు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చీరను చూసి పలువురు అబ్బురపడ్డారు. ఆయన కళాత్మకతను చూసి అభినందించారు. పోచంపల్లిలోని ప్రముఖ కళా పునర్వి యూనిట్ కూడా సాయి భరత్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.