హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో (ఏఐజీ) హాస్పిటల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగి మృతిచెందడం అనుమానాలకు తావిస్తున్నది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేయం ఇచ్చి, ఇల్లు, ఆస్తులు అమ్మి దవాఖాన బిల్లు కడితే.. శవాన్ని చేతులో పెట్టారని మృతుడి భార్య విలపించారు. దవాఖాన ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన మురళి (40) నిరుడు నవంబర్‌లో విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మురళిని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తీసుకొని రాగా, పరీక్షించిన ఏఐజీ వైద్యులు కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, మార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకు రూ.30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.
కాలేయం కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేశారు. ఆర్గాన్స్ సీరియల్ నంబర్ ప్రకారం ఇస్తారని, కొంతకాలం వేచిచూడాలని ఏఐజీ వైద్యులు సూచించారు. రోగి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో అతడి కుటుంబ సభ్యులు నిమ్స్‌లోని జీవన్‌దాన్ ప్రతినిధులను సంప్రదించారు. దీంతో వారు వివరాలను పరిశీలించి చూడగా రోగి వయస్సు 60 ఏండ్లుగా పేర్కొన్నట్టు గుర్తించారు. 60 ఏండ్ల వయసున్న రోగికి అవయవదానం చేయడం కుదరదని చెప్పారు. వయసు తప్పుగా ఎందుకు నమోదు చేశారని ఏఐజీ దవాఖాన సిబ్బందిని మురళి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాలేయం దానం చేయడానికి మురళి భార్య ముందుకు వచ్చింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు అవయవదాత బ్లడ్ గ్రూప్ ‘బీ’, స్వీకర్త బ్లడ్ గ్రూప్-‘ఓ’ అయినప్పటికీ కాలేయమార్పిడికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 28న మురళికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రోగి పూర్తిగా కోలుకోకపోవడంతో అప్పట్నుంచీ దవాఖానలోనే చికిత్స అందిస్తున్నారు.
18 రోజులుగా నోట మాటలేదు
మురళి తమతో చివరిసారిగా సెప్టెంబర్ 24న మాట్లాడాడని, ఆ తర్వాత నోటి మాట, కదలికలు లేవని కుటుంబసభ్యులు చెప్తున్నారు. రోగికి ఏమీ కాదని, కోలుకుంటాడని, కొంత ఇన్ఫెక్షన్ వల్ల అలా ఉన్నట్టు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇదంతా నమ్మి ఆస్తులు అమ్ముతూ.. బిల్లులు చెల్లిస్తూ వచ్చామని మురళి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ 18 రోజులుగా మురళిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారని తెలిపారు. భూమితోపాటు ఉన్న ఏకైక ఇల్లును కూడా అమ్మి మరో రూ.23 లక్షలు చెల్లించామని తెలిపారు. మరింత డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తమ దగ్గర లేదని చెప్పడంతో శనివారం డిశ్చార్జి చేస్తామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి ఒంటిగంటకు డిశ్చార్జి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటిలెటర్‌పై ఉన్న మురళిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చి అంబులెన్స్‌లో ఎక్కించారని, కానీ అప్పటికే మురళి చనిపోయాడని చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, కాలేయాన్ని ఇచ్చినా తన భర్తను బతికించలేదని, జీవన్‌దాన్‌లో వివరాలు సరిగ్గా నమోదు చేయకుండా 5 నెలలపాటు కాలయాపన చేసి, రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా తమకు మాత్రం 75 శాతం కోలుకున్నట్టు అబద్ధాలు చెప్పారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. లక్షల రూపాయల బిల్లులు కట్టించుకుని, డబ్బు కట్టగానే ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో డిశ్చార్జ్ చేసి, శవాన్ని అప్పగించారంటూ మృతుడి భార్య బోరున విలపించింది.
జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్‌లో టైపింగ్ మిస్టేక్ జరిగింది
మురళి ఆరోగ్యం విషయమై వారి కుటంబ సభ్యులకు ముందుగానే చెప్పాం. అతడికి ప్రాణపాయం ఉంటుందని కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్‌లో మాత్రం రోగి వయస్సు 39కి బదులు 60ఏండ్లుగా టైపింగ్ మిస్టెక్ పడింది. దానిని వెంటనే సరిచేశాం. చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదు. బిల్లుల విషయంలో కూడా ముందుగానే చెప్పాం. ఖచ్చితమైన ప్యాకేజీ అంటూ ఉండదు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఖర్చులు మారవచ్చు.
– సత్యనారాయణ, ఏఐజీ పీఆర్వో