Telangana | నమస్తే తెలంగాణ, నెట్వర్క్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు లేక పడిగాపులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణ చూపలేదు. గురువారం ఒక్కసారిగా దంచికొట్టిన వానతో ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి. కల్లాల్లో కండ్ల ముందే కొట్టుకుపోతున్న వడ్లను చూసి రైతుల కన్నీళ్లు వరదలై పారాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిశాయి. రైతులు రాత్రంతా నిద్రాహారాలు మాని, కాలువలు తీసి నీటిని తొలగించారు. గురువారం అధికారుల తీరును నిరసిస్తూ కల్లాల వద్దే రైతులు ఆందోళన చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో, సిద్దిపేట జిల్లా వర్గల్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది.
మెదక్ జిల్లా కొల్చారం, చిలిపిచెడ్, నిజాంపేట్, రామాయంపేట్ మండలాల్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వడ్లు తడిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు.
గజ్వేల్ రింగ్‌రోడ్డు వెంబడి అరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్డు వెంబడి కొట్టుకపోతున్న వడ్లను రైతులు ఒకదగ్గరకు చేర్చుతున్నారు. సింగాటం, శ్రీగిరిపల్లి, అహ్మదీపూర్, బూరుగుపల్లి, దిలాల్పూర్, శేర్పల్లి గ్రామాలకు వెళ్లే మార్గాల్లో రోడ్ల వెంబడి ఆరబెట్టిన వడ్లుదీ దాదాపు ఇదే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశుల చుట్టూ నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ మార్కెట్ యార్డులోనూ ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆగమాగమయ్యారు.