మహబూబ్నగర్ : నమస్తే తెలంగాణ జర్నలిస్ట్, ఫోటో గ్రాఫర్లపై దాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం టై రోడ్డు వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతరాష్ట్ర రహదారిపై రోడ్డు మీద బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారిని పూర్తిగా స్తంభింపజేశారు. పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులు కూడా మద్దతు తెలపడంతో సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా ( Sand Mafia ) గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ ( Namasthe Telangana ) మాగనూరు విలేకరి రాము( Ramu ) , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. కృష్ణ మండలం గుడెబల్లూరు సమీపంలోని కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఆ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి, ఫోటోగ్రాఫర్పై మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది.