మహబూబాబాద్ : బయ్యారంలో(Bayyaram) ఉక్కు ఫ్యాక్టరీ( Steel factory) నిర్మించాలని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుష్కలంగా ఖనిజ నిక్షేపాలు, అన్ని వసతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా(CPI dharna) చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాగా, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టిన విషయం తెలిసందే. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్టతో పాటు రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.
ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని నాటి ప్రభుత్వ పెద్దలు భావించి విభజన చట్టంలో పొందుపర్చారు. సెయిల్ ఆధ్వర్యంలో రూ.30వేల కోట్లతో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారం బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సబ్బండ వర్ణాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.