కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 27 : ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికి రుణమాఫీ(Loan waiver) చేయాలని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాక ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు రైతు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) ఎదుట మంగళవారం రైతులతో కలిసి చేపట్టిన ధర్నాలో(CPI Dharna) అయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రతి రైతుకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. కొందరికే రుణమాఫీ డబ్బులు వచ్చి మిగతా రైతులకు రాక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు అందరికీ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సీపీఐ పక్షాన ప్రభుత్వంపై పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నరేందర్‌రెడ్డి, సదానందం, సంపత్, ఎల్లయ్య, బాపురెడ్డి, రాములు పాల్గొన్నారు.