న్యాల్కల్, సెప్టెంబర్ 3 : ఫార్మాసిటీ(Pharmacy city) వద్దే వద్దు.. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ సంగారెడ్డి జిల్లా(Sangareddy) న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రమైన న్యాల్కల్లోని ప్రధాన వీధు ల గుండా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, భూబాధితులు, ప్రజలు భారీ ర్యాలీ చేపట్టా రు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోని న్యాల్కల్-ముంగి ప్రధాన రోడ్డు మార్గంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా పర్వలేదు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వలేమన్నారు. తమ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసే ఫార్మాసిటీతో ఈ ప్రాంతమే విషపూరితమయ్యే ప్రమాదముందని తెలిపారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తామని, వాటిని మాత్రం వదులుకునేది లేదని, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భయపడేదిలేదని స్పష్టం చేశారు. తమ గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఆనంతరం తహసీ ల్దార్ భూపాల్ను కలిసి ఫార్మాసిటీకి భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ వినతి పత్రాన్ని అందజేశారు.