కంఠేశ్వర్, ఫిబ్రవరి 15: నిజామాబాద్ మార్కెట్ యార్డులో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి తమను దొంగలుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ హమాలీలు ఆందోళనకు దిగారు. దీంతో పసుపు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. మార్కెట్లో పనిచేసే కొందరు పసుపు దొంగతనం చేస్తున్నారని చైర్మన్ ఆరోపించడంతో హమాలీలు ధర్నాకు దిగారు. దాదాపు 40 ఏండ్లుగా ఇక్కడ పనిచేస్తున్న తమపై నెపం మోపడం ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి మార్కెట్‌ను సందర్శిస్తున్నానన్న చైర్మన్.. ఇప్పటిదాకా ఎంత మంది దొంగలను పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలక వర్గంలోని కొంత మంది సభ్యులు కావాలనే మార్కెట్ యార్డును బద్నాం చేయడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తమను దొంగలుగా చిత్రీకరించిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అప్పటివరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి అక్కడికి చేరుకోగా హమాలీలు ఆయన్ను చుట్టుముట్టారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కార్మికులు సెక్యూరిటీ ఇన్చార్జి శ్రీనివాస్‌పై దాడి చేశారు. పోలీసులు వచ్చి అతడిని అక్కడి నుంచి తరలించడానికి యత్నిస్తుండగా, వాహనానికి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం తర్వాత హమాలీలు ఆందోళన విరమించడంతో పసుపు క్రయవిక్రయాలు కొనసాగాయి.