సిద్దిపేట : హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్(Regional Ring Road) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధితులు ర్యాలీ తీశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనం తరం అక్కడి నుంచి ర్యాలీగా ఇందిరాపార్కు చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయం(Gajwel IOC office) వరకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని చేబర్తి, నర్సన్నపేట, ఇటిక్యాల, పీర్లపల్లి, ఇప్పగూడెం, వర్గల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఐవోసీ కార్యాలయం ఎదుట ఫ్ల్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బాధితులు ఇటిక్యాల భాస్కర్, ఎల్లారెడ్డి, చేబర్తి సాయిలు, చేబర్తి బాల్‌నర్సయ్య మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో సాగు భూములు కోల్పోతుండడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని, అలైన్మెంట్లో మార్పులు చేయాలని ఉగాది పండుగ రోజున రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి విన్నవించగా మంత్రిగా సానుకూలంగా స్పందించారన్నారు.
కానీ, ఇప్పుడు రెవెన్యూ అధికారులు భూసేకరణ కోసం నోటీసులు పంపుతున్నారని, మంత్రి మాటకే విలువ లేదా అని నిర్వాసితులు ప్రశ్నించారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి రోడ్డు నిర్మాణంలో పోతే ఆత్మహత్యలే దిక్కవుతాయని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఇక్కడ రైతులను నమ్మించేలా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి, ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రులను కలవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు పనులు వెంటనే ఆపాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.