గజ్వేల్, సెప్టెంబర్ 1: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా తప్పుల తడకగా ఉన్నదని విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ సమీపంలో హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రాహదారిపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాజెక్టుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడానికి చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి, కేంద్రంలోని నరేంద్రమోదీ దగా చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించే కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మాటతో కమిషన్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.