హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): పెండింగ్ డీఏలను విడుదల చేయకపోవడం, పీఆర్సీని ప్రకటించకపోవడం, పెండింగ్ బిల్లులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 23న చలో ఇందిరాపార్క్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపునిచ్చింది.
ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్షను తలపెట్టినట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ తెలిపారు. తపస్ రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కార్యాచరణను ప్రకటించారు.
22న పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన, 29న ఎమ్మార్వో ఆఫీసుల వద్ద నిరసన, నవంబర్ 5న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 23న ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్షను నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర సహధ్యక్షులు అయిలినేని నరేందర్‌రావు, అల్గుపల్లి పాపిరెడ్డి, బెండి ఉష, అదనపు ప్రధాన కార్యదర్శివర్గం తదితరులు పాల్గొన్నారు.