హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.1500 కోట్లకు చేరింది. పోర్టల్ ద్వారా గతేడాది నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నాటి నుంచి నేటివరకు పోర్టల్ ద్వారా సుమారు 12.5 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధికంగా భూముల అమ్మకాలు (సేల్) ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 5.25 లక్షల సేల్డీడ్లు నమోదయ్యాయి. 1.65 లక్షల వరకు గిఫ్ట్డీడ్లు, 78 వేల వరకు భాగపంపకాలు జరిగాయి. 2.13 లక్షల పెండింగ్ మ్యుటేషన్లకు మోక్షం లభించింది. వీటితోపాటు ఇతర లావాదేవీలు కలిపి ప్రభుత్వానికి రూ.1500 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం ధరణి పోర్టల్లో వివిధ మాడ్యూల్స్ కింద సగటున 80 శాతానికి పైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు సమాచారం.