హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునర్నిర్మాణ కమిటీ ఇప్పటివరకు నివేదికను సిద్ధం చేయలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్‌పై మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టి చర్చ జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో పేర్కొన్న లోపాలను హైలెట్ చేస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలని భావించింది. తద్వారా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టొచ్చని యోచించింది. అయితే, ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇప్పటివరకు నివేదిక సిద్ధం చేయలేదు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కమిటీ నివేదిక ఇచ్చేదెప్పుడు? ప్రభుత్వం రివ్యూ చేసేదెప్పుడు? దాన్ని ప్రజల ముందు పెట్టేదెప్పుడు? అని నిలదీసినట్టు తెలిసింది. మరోవైపు.. వివిధ శాఖల అధికారులతో ధరణి కమిటీ ఇటీవలే సమావేశాలు పూర్తిచేసింది.