హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ దేశ భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మక కార్యక్రమం అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా రంగంలో వచ్చిన అతిపెద్ద సంసరణ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ధరణి ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంవత్సర కాలంలో ధరణి సాధించిన విజయాలను తెలిపే బుక్‌లెట్‌ను సీఎస్ విడుదలచేశారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ధరణిని అమలుచేసే సంకల్పం, సాహసం సీఎం కేసీఆర్‌కు తప్ప మరెవరికీ లేదని అన్నారు. పోర్టల్ ఊహించినదానికన్నా విజయవంతమైందని చెప్పారు. ఏడాదికాలంలో 5.14 కోట్ల సార్లు వీక్షించడం, పది లక్షలకుపైగా లావాదేవీలు జరుగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ధరణికి ముందు రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తాసిల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు.
ధరలు పెరిగినా.. వివాదాలు పెరుగలే
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్రంలో భూముల ధరలు ఒకసారిగా నాలుగైదు రెట్లు పెరిగాయని సీఎస్ తెలిపారు. ఈ సమయంలో ధరణి వల్ల భూ రికార్డులు పటిష్ఠంగా, వివరాలను తారుమారు చేసే పరిస్థితులు లేకపోవడంతో భూములు సురక్షితంగా ఉన్నాయని, వివాదాలు తలెత్తడం లేదని స్పష్టంచేశారు. ధరణి రూపకల్పన, విజయవంతంగా కొనసాగడంలో ఎంతో మంది సీనియర్ అధికారులు, వందల మంది ఐటీ నిపుణుల శ్రమ ఉన్నదని తెలిపారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యులైన పలువురు అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్రావు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు.