హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిలభారత పోలీస్ డ్యూటీ మీట్లో హ్యాట్రిక్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన తెలంగాణ పోలీస్ ప్రతినిధులను డీజీపీ శివధర్‌రెడ్డి సోమవారం అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం.. వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ చాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకోవడం అద్భుతమని ఆయన కొనియాడారు. 2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోనూ విజేతగా నిలిచిన తెలంగాణ.. ఇటీవల నాగ్‌పూర్ వేదికగా ముగిసిన డ్యూటీ మీట్లో హ్యాట్రిక్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. డీజీపీని కలిసిన వారిలో సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా, కోచ్‌లు ప్రతాప్, రామకృష్ణ, టీమ్ మేనేజర్ ప్రసాద్, క్రీడాకారులు ఉన్నారు.
మేఘాలయలోని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న తొమ్మిది మంది ప్రొబేషనరీ డీఎస్పీలు, ఐదుగురు క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్ల బృందం భారత దర్శన్ అధ్యయన యాత్రలో భాగంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డిని సోమవారం కలిసింది. రాష్ట్ర పోలీస్ పనితీరును, ఇకడ అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, శాంతిభద్రతల పరిరక్షణలో అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకున్నారు. వృత్తిపరమైన మెళకువలను వివరించడమే కాకుండా, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని వారికి డీజీపీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ ఎం భగవత్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ పర్వేజ్ షేక్ పాల్గొన్నారు.