హైదరాబాద్, వినాయక్ నగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మరణంపై శనివారం విచారం వ్యక్తంచేశారు. ఓ దొంగను స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ తీవ్ర రక్తస్రావంతో చనిపోయిన సంగతి తెలిసింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన డీజీపీ, నిందితుడు రియాద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకబృందాలు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సాయిచైతన్య మృతదేహానికి నివాళులు అర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డిపార్ట్మెంట్ తరఫున వచ్చే బెనిఫిట్స్‌ను త్వరగా ఇప్పించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఐజీ హామీ ఇచ్చారు.