హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని, డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. ఈ విషయమై ఆయన బుధవారం ట్విటర్ (ఎక్స్) వేదికగా డ్రగ్స్ పెడ్లర్స్‌ను హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా నిషేధించేందుకు మాదకద్రవ్యాల వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కోరారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారు తక్షణమే రాష్ర్టాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. నిబంధనలు ఉల్లింఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ భూతాన్ని పారదోలేందుకు పోలీసు విభాగాలు పరస్పరం సహకరించుకోవాలని, ప్రజలు సైతం భాగస్వామ్యం కావాలని డీజీపీ కోరారు. ఈ పోస్టుకు లక్షల్లో వ్యూస్ రాగా.. చాలా మంది నెటిజన్స్ సలహాలు, సూచనలు ఇచ్చారు. డ్రగ్స్‌పై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని, ఇన్ఫార్మర్ల వివరాలు గోప్యంగా ఉంచి రివార్డులు అందించాలని ఓ నెటిజన్ కోరాడు. డ్రగ్స్‌కు బానిసైన వారికోసం డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మరో నెటిజన్ కోరాడు. ప్రస్తుతం పోస్టల్, కొరియర్, పార్సిల్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ డెలివరీ అధికంగా జరుగుతున్నదని, దానిపై దృష్టి పెట్టాలని కోరారు.
పోలీస్‌శాఖకు సాంకేతిక హంగులద్దిన డీజీపీ
తెలంగాణ రాష్ర్టానికి నాలుగో డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించిన రవిగుప్తా రాష్ట్ర పోలీస్ శాఖలో విశిష్ట సేవలందిస్తూ వచ్చారు. సాంకేతిక హంగులు అద్దడంలో ఆయన తనదైన పాత్ర పోషించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌడీకి చెందిన రవిగుప్తా 1965 డిసెంబర్ 19న జన్మించారు. 1987లో ఐఐటీ కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఎంఈ)లో 1989 నుంచి 1990 వరకు పనిచేశారు. అనంతరం 1990లో ఐపీఎస్ సాధించిన ఆయన ఏపీ క్యాడర్‌కు వచ్చారు. ఐపీఎస్‌గా కెరీర్ మొదట్లోనే వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. లా అండ్ ఆర్డర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో 2010 నుంచి పోలీస్ కంప్యూటర్స్ సర్వీసెస్ అండ్ స్టాండైర్డెజేషన్కు బదిలీ అయిన రవిగుప్తా సీసీటీఎన్ ప్రాజెక్ట్‌లో కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించిన రవిగుప్తా ఈ నెల 3న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 19 నాటి పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీపీ రవిగుప్తాను వరించిన అవార్డులు
సంవత్సరం అవార్డు