హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పని చేస్తేనే తెలంగాణ పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని నిలుపుకోగలుగుతుందని డీజీపీ జితేందర్ (DGP Jitender) అన్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కీలకపాత్ర వహిస్తారని, ఆ స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అగ్రస్థానాన్ని కొనసాగించగలుగుతుందని చెప్పారు. ప్రజల క్షేమమే పరమావధిగా భావిస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం పోలీస్ శాఖకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది పని చేయాలని తెలిపారు. పోలీసు సిబ్బంది ప్రజల కోసం ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సి ఉందని చెప్పారు.
ప్రజల ఆకాంక్షలలో కాల క్రమేణా మార్పులు వస్తుంటాయని తదనుగుణంగా పోలీస్ సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేశారు. దానికి విరుద్ధంగా పనిచేస్తే పోలీస్ అధికారులకు మంచి పేరు ఉండదని తద్వారా సిబ్బంది భవిష్యత్తు ఆశించిన స్థాయిలో ఉండదని పేర్కొన్నారు. పోలీసు అధికారుల బంధువులు , స్నేహితులు ప్రజలే కాబట్టి వారి ద్వారా కూడా తమ పనితీరును అంచనా వేసుకోవచ్చన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ పనితీరును మెరుగుపరచుకోవడమే గాక తమ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, తద్వారా నిజం వెలికి తీసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కన్విక్షన్ రేటు పెరిగినప్పుడు బాధితుల అభిమానం పొందగలుగుతామని, నిందితులలో తప్పు చేయకూడదనే ఆలోచన రావాలన్నారు.
చాలా కాలం క్రితం అమలులో ఉన్న ట్రాఫిక్ పద్ధతి ప్రకారం చాలాన్లు వసూలు చేసేవారని తద్వారా పోలీస్ సిబ్బందిపై ఆరోపణలు వచ్చేవని, కానీ క్యాష్ లెస్ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీస్లపై ఆరోపణలు తగ్గాయన్నారు. ఈ విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా, క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రకారం పని చేస్తూ బాధితులకు అండగా ఉంటూ, నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉండడమే కాక, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ వారు ప్రకటిస్తున్న టాప్ పోలీస్ స్టేషన్లలో తెలంగాణ స్టేషన్లు కూడా అవార్డులు గెలుచుకోవడం గమనించాలన్నారు. ఇలాంటి ప్రశంసలు తమకు కూడా రావాలని రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరూ నిబద్ధతతో పని చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరింతగా పేరు సంపాదిస్తుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు వేగంగా జరుగుతున్నందున నకిలీ విత్తనాల అమ్మకాలపై, ఉత్పత్తిదారులపై నిఘా పెట్టాలని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి నిందితులను శిక్షించాలనీ తద్వారా రైతులను ఆదుకోవాలని సూచించారు. శాంతి భద్రతల ఏఐజి శ్రీ రమణ కుమార్, డీఎస్పీ శ్రీ సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.