హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం కలియదిరిగారు. దాదాపు మూడు గంటల పాటు కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, విధి నిర్వహణలో మరింత సమర్థతను చాటాలని ఆదేశించారు. కార్యాలయంలో ఎకడపడితే అకడ ఫైళ్లను ఉంచకుండా, తక్షణమే వాటిని రికార్డు రూమ్‌కు తరలించాలని సూచించారు.
కాన్ఫరెన్స్ హాల్, ఇతర గదులను మరింత విశాలంగా మార్చేందుకు వీలుగా రీ-డిజైనింగ్ చేయాలని అధికారులను కోరారు. డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ ఎం భగవత్, డీజీ (ఆర్గనైజేషన్ అండ్ హోంగార్డ్స్) స్వాతీ లక్రా, డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వీవీ శ్రీనివాసరావు, డీజీ (సీఐడీ) చారు సిన్హా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తదితరులు తమ విభాగాల పనితీరు, ప్రస్తు తం కొనసాగుతున్న కార్యకలాపాలను డీజీపీ సీవీ ఆనంద్‌కు వివరించారు.