హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి రాజైనా.. ఓ తల్లికి కొడుకే అన్న చందంగా తెలంగాణ పోలీస్ బాస్ అయిన తర్వాత డీజీపీ హోదాలో సీవీ ఆనంద్ ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో ఆయన పంచుకున్నారు. ‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను.
నవంబర్-జనవరి మధ్యలో చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమైనప్పటికీ త్వరగానే కోలుకున్నారు. తన కొడుకు ఈ రాష్ర్టానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛను నెరవేర్చానని నాకు అనిపించింది. ఆమె నన్ను ఆశీర్వదించి ఎంతో సంతోషించారు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ తల్లి యశోదాదేవి ఆశీర్వదిస్తున్న ఫొటోలను షేర్ చేశారు.