హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతున్నదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో రిటైర్డ్ ఎస్పీ మహ్మద్ ఖాసీం తన సర్వీసులో సాధించిన 16 పతకాలను డీజీపీ అంజనీకుమార్, అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆధ్వర్యంలో పోలీస్ మ్యూజియానికి బహూకరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. యువ పోలీస్ అధికారులు తమ శరీర దారుఢ్యాన్ని కాపాడుకుంటూ క్రీడాపోటీల్లో పాల్గొని శాఖకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. యువ పోలీస్ అధికారులకు ఖాసీం ఆదర్శమని కొనియాడారు. పర్వతారోహణలో నిష్ణాతులైన ఐజీ తరుణ్‌జోషి త్వరలోనే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించనున్నట్టు తెలిపారు. మారథాన్స్‌లో పేరుగాంచిన డీఐజీ రమేశ్‌రెడ్డి త్వరలో పాల్గొనబోయే జాతీయ, అంతర్జాతీయ మారథాన్ల గురించి వివరించారు. తన సర్వీసులో 10 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ సాధించానని రిటైర్డ్ ఎస్పీ ఖాసీం తెలిపారు. ఖాసీం దంపతులను డీజీపీ ఘనంగా సన్మానించారు.