హైదరాబాద్ : తెలంగాణలో వ్యవస్థీకృత దోపిడీలు, సాంప్రదాయ నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని డీజీపీ అంజనీకుమార్(DGP Anjani Kumar) తెలిపారు. ప్రత్యేకించి హైదరాబాద్ శివార్లలో నేరాలు గణనీయంగా తగ్గాయని, అదే సమయంలో సైబర్(Cyber) నేరాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలోని జోనల్ ఐజీపీ, రేంజ్ డీఐఎస్జీ, అన్ని యూనిట్ అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు. నెలవారీ ఆన్లైన్ గ్రేవ్ క్రైమ్ రివ్యూ, ఫంక్షనల్ వర్టికల్స్, సైబర్ క్రైమ్స్, హెచ్ఆర్ఎమ్లు, పాత కేసుల స్థితి, నేరారోపణ రేటు, నేర విశ్లేషణ, ఇతర కీలక అంశాలను సమావేశంలో చర్చించారు. అండర్ ఇన్వెష్టిగేషన్ (UI), పెండెన్సీ కేసుల (Pendency Cases) పరిష్కారంపై డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.
అత్యధిక కేసులను పరిష్కరించడంలో రామగుండం యూనిట్ (Ramagundam ) అత్యుత్తమంగా పనిచేసినందుకు అభినందనలు తెలిపారు. మహిళలపై నేరాలు 46.34 శాతం తగ్గాయని ఆయన అన్నారు. పెండింగ్‌ను క్లియర్ చేయడంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు రివార్డులు అందజేస్తామని తెలిపారు. సమాజంలో జరుగుతున్న నేరాల స్వభావం ప్రతి దశాబ్దానికి ఒక్కసారీ మారుతుందని అన్నారు.
ఇంటర్నెట్ వినియోగం పెరుగడం వల్లనే ప్రతిచోటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సమర్థవంతంగా పనిచేసే బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఏడీజీపీ, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ , పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.