హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌లుగా ఉన్న 1995వ బ్యాచ్‌కు చెందిన వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, మహేశ్ భగవత్‌లకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. డీజీ హోదా కలిగిన వారిలో ఇటీవల కాలంలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్ ఉద్యోగ విరమణ పొందగా.. రవిగుప్తా వీఆర్ఎస్కు పెట్టుకున్న దరఖాస్తు తాజాగా ప్రభుత్వం ఆమోదించడంతో డీజీ ర్యాంకు కోసం మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో సీనియర్ల రిటైర్మెంట్ కారణంగా కొన్ని నెలలుగా డీజీ హోదా కోసం ఎదురుచూసిన వారికి లైన్ క్లియర్ అయ్యింది.
ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. డీజీ హోదాకు అర్హత కలిగిన ఈ ముగ్గురి పేర్లను యూపీఎస్సీకి పంపితే.. వారు పరిశీలించి ఆమోదం తెలిపితే డిసెంబర్‌లోపే డీజీ హోదా రానున్నది. పోలీసుశాఖలో అత్యున్నత హోదా కోసం కొన్ని నెలల పాటు ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తనే చెప్పాలి. కానీ వీరి డీజీ హోదా ఫైలు, రెగ్యులర్ డీజీపీ కోసం పంపే ఫైలు ఒకేసారి పంపనున్నట్టు సమాచారం. అలా చేస్తే మాత్రం జనవరి తర్వాతే అనే అని తెలుస్తున్నది.
పోలీసు శాఖలో రెగ్యులర్ డీజీపీపై చర్చ జరుగుతున్నది. అర్హత ఉన్న అందరి పేర్లను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపనున్నది. వారిలో సీనియార్టీ ప్రకారం సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యామిశ్రా, శిఖాగోయెల్ పేర్లు ఉండనున్నాయి. ఈ ఆరుగురిలో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి వారిలో ఒకరిని రెగ్యులర్ డీజీపీగా ఎంపిక చేసుకోవచ్చని రాష్ర్టానికి యూపీఎస్సీ సిఫార్సు చేయనున్నది.
యూపీఎస్సీ నుంచి వచ్చే ఆ మూడు పేర్లలో సీనియార్టీ ప్రకారం 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994వ బ్యాచ్‌కు శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్ పేర్లు ఉంటాయని తెలిసింది. కాగా, తెలంగాణ క్యాడర్‌కు అలా ట్ అయిన వినాయక్ ప్రభాకర్ అప్టే (1994 బ్యాచ్) కేంద్ర సర్వీసుల్లోనే కొనసాతానని మొదట్లోనే స్పష్టంచేశారు. ఇప్పటికే డీజీపీ(కో ఆర్డినేషన్)గా శివధర్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి డీజీపీగా నియమించనున్నది. శివధర్‌రెడ్డి కోసమే రవిగుప్తాతో వీఆర్ఎస్ పెట్టించారని చర్చ జరుగుతున్నది.