నార్కట్పల్లి: నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు.. నిప్పులపై నడించారు. ఈ సందర్భంగా శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. అగ్నిగుండాలలో కందులు, ఆముదాలు వేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నెల 9 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువార తెల్లవారుజామున స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు, దీక్షా హోమాలు, రుద్రహోమం, బలిహరణ, సరస్వతీపూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిశేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించారు. జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.