హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వేసవి సెలవులకుతోడు శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలేశుడి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నది. శనివారం 97,250 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం కూడా అదే సంఖ్యలో రద్దీ కొనసాగుతుంది. నారాయణగిరి షెడ్ల నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు పెద్దఎత్తున భక్తులు బారులు తీరారు. బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు తాతాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా శనివారం 97వేలకు పైగా భక్తులు భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో దాదాపు 3.76 కోట్ల మేర హుండీ ఆదాయం సమకూరింది.
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతున్నది. మరోవైపు శ్రీవారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌కుమార్ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో టీటీడీ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం స్వామివారికి పూజా కైంకర్యాల కారణంగా దర్శన సమయం తకువగా ఉంటుంది.
అయినా ఈనెల 22న తొలిసారిగా 94,758 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవాసమయంలోనూ సర్వదర్శనం క్యూలను అధికారులు యథావిధిగా కొనసాగించారు. దీంతో అదనంగా 5,850 మంది భక్తులు దర్శించుకోగలిగారు. మొత్తంగా శుక్రవారం సర్వదర్శనానికి ఏకంగా 17 గంటలకుపైగా సమయాన్ని కేటాయించారు. ఒకరోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఏకంగా 90 వేలు దాటడం నాలుగోసారి అని టీటీడీ అధికారులు వెల్లడించారు.