పాపన్నపేట, మార్చి 2 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. జాతర సందర్భంగా బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగా.. మిగిలిన బండ్లు దాన్ని అనుసరించాయి. రంగురంగుల చీరలతో అలంకరించిన బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉపవాసదీక్షలు చేపట్టిన భక్తులు, బుధవారం ఉదయం మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి జగన్మాతను దర్శించుకుని ఉపవాస దీక్షలు విడిచారు.
ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది.
శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి. అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. భక్తులు వనదుర్గాభవానీ మాతకు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. జాతర చివరి రోజు గురువారం రాత్రి రథోత్సవం జరగనుంది.