యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో(Yadagirigutta) వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు.
ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార దర్శన మిచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షపుష్పార్చన, ఆర్జిత సేవలు రద్దు చేశారు. అలాగే నేటి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. 6 రోజుల పాటు అలంకార సేవల్లో లక్ష్మీనరసింహా స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.