జయశంకర్ భూపాలపల్లి, మే 18 (నమస్తే తెలంగాణ)/ మహాదేవ్‌పూర్: కాళేశ్వరంలో సర్వస్వతీ పుష్కరాల నిర్వహణ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధర్మదర్శనం కోసం నిలబడిన భక్తుల క్యూలైన్ ఎంతకూ కదలకపోవడం.. అధికారి పార్టీ నాయకులు తమ అనుచరులు, బంధువులకు నేరుగా గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం కల్పించడం వంటి చర్యలతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సహనం నశించిన భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లో నుంచి బయటికి వచ్చి తోసుకుంటూ ప్రధాన ద్వారం ద్వారా గర్భగుడిలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు మిగిలిన వారిని అడ్డుకుని క్యూలైన్ ద్వారా పంపారు. తోపులాటలో పలువురు చిన్నారులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు.
పుష్కరాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉద్యోగులు, ఇతర రాష్ర్టాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మంది వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్ జాయ్ రైడింగ్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించి ఏరియల్ సర్వే చేశారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో సామాన్యులకు దర్శనం ఉండదా? పోలీసులు దర్శనం చేయిస్తున్న వారంతా వీఐపీ లేనా? మె యిన్ ద్వారం దగ్గర నుంచి పోలీసులు ఇష్టారాజ్యంగా దర్శనం చేయిస్తున్నారు. మేము ఎంతసేపు లైన్లో ఉండాలి? పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. పైరవీ ఉంటేనే దర్శనం జరుగుతుందంటే పైరవీలతో వచ్చే వాళ్లం.
– వల్లాల యుగేందర్, భక్తుడు, ఖమ్మం
ఆలయంలో ఓ పద్ధతి లేదు. ఎవరికి వారే ఆలయ ఈవోగా చెలామణి అవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది భక్తులకు శాపంగా మారుతుంది. మేం ఐదు గంటలుగా క్యూలోనే ఉన్నాం. అడుగు ముందుకు పడటం లేదు. పోలీసులు దగ్గరుండి కొంతమందిని నేరుగా గర్భగుడిలోకి పంపిస్తున్నారు. సామాన్యుల గోడు ఎవరికీ పట్టడం లేదు.
– భాను, భక్తుడు, హైదరాబాద్