వరంగల్, జనవరి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ములుగు/ ములుగురూరల్: మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాన్వాయ్‌పై భక్తులు దాడి చేశారు. గురువారం రాత్రి తల్లులు కొలువుదీరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. జంప న్న వాగు వద్ద కరెంట్ పోవడం, మంత్రి అడ్లూ రి కాన్వాయ్ సైరన్ మోత, అనుచరుల అత్యుత్సాహంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీంతో కాన్వాయిపై భక్తులు దాడి చే యగా, ఎస్కార్ట్ వాహనంతో పాటు మరో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఖాకీల ఓవరాక్షన్
మేడారం మహాజాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులనూ విచక్షణ మరచి ప్రవర్తించడమే గాక లాఠీలతో విరుచుకుపడి నెత్తురు కండ్లజూశారు. అశేషంగా పోటెత్తిన భక్తులను కంట్రోల్ చేయాల్సిన ఖాకీలే ‘కంట్రోల్’ తప్పి లాఠీలతో ప్రతాపం చూపగా, కోపంతో రగిలిపోయిన జనం.. పోలీసులపై చెప్పులు విసిరారు. మునుపెన్నడూలేని విధంగా సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భక్తులకు సాహసం చేయాల్సి వచ్చింది. సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన లైన్లతో పాటు జాతర నిర్వహణలో అనుభవం లేని పోలీసులతో ఇబ్బందులు పడ్డారు. తల్లులిద్దరు కొలువుదీరడంతో శుక్రవారం ఉదయం నుంచే గద్దెల ప్రాంగణం, లైన్లు కిక్కిరిసిపోయాయి. రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో పోలీసులు సహనం కోల్పోయారు. ప్రధాన ద్వారాన్ని మూసివేసి దారి మళ్లించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో కొంతమంది భక్తులు క్యూలైన్ గ్రిల్ ఎక్కి తమను లోపలికి అనుమతి ఇవ్వాలని కోరారు. అంతే, ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బోర్డర్లో అధీన రేఖను దాటేస్తున్న దుండగులపై విరుచుకుపడినట్టే భక్తులపై పోలీసులు విచక్షణ కోల్పోయారు. ప్రధాన ద్వారం నుంచి సీఐ సహా పోలీసుల బలగాలు ఒక్కసారిగా దూసుకొచ్చి భక్తులను ఇష్టమొచ్చినట్టు కర్రలతో కొట్టారు. దొరికినవారిని దొరికినట్టు ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు కురిపించారు. ఏటూరునాగారం ఏఎస్పీ, సీఐ సహా గ్రేహౌండ్స్, ఏఆర్ పోలీసులు భక్తులపై రెచ్చిపోయారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆడ, మగ అనే తేడాలేకుండా నెత్తురుకారేలా చితకబాదారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో చెప్పులు విసిరారు. దర్శనం కోసం వస్తే పోలీసులు తమ నెత్తురు కండ్ల జూశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా సమ్మక మెయిన్ గేట్ వద్ద భక్తులు ఆందోళనకు దిగారు.
క్యూలో అవస్థలు.. దవాఖానలో తిప్పలు
గంటల తరబడి క్యూలైన్లో తీవ్రమైన ఉక్కపోత, అలసట కారణంగా వందలాది మంది భక్తులు నీరసించిపోయారు. కీళ్ల నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. మేడారంలోని 50 పడకల సూపర్స్పెషాలిటీతో పాటు మినీ దవాఖాల్లో చికిత్స కోసం వేచిచూడాల్సిన దుస్థితి. తమకు వైద్యం అందడం లేదని, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. బెడ్లు ఖాళీ లేక చాలామంది భక్తులు దవాఖాన ఆవరణలోనే నిరీక్షించారు.
నాలుగైదు గంటల సేపు ట్రాఫిక్ జామ్
మేడారానికి వాహనాలు బారులు తీరడంతో వాటిని క్రమబద్ధీకరించే క్రమంలో అధికారులు, పోలీసుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. పస్రా-తాడ్వాయి మధ్య శుక్రవారం నాలుగైదు గంటల సేపు ట్రాఫిక్‌జామ్ అయింది. జాతర చరిత్రలో 2004 తర్వాత మళ్లీ ఈ సారే తీవ్ర ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులే వాపోతున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో బస్సులు లేక మేడారంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమే కాదు, ఇంగ్లిష్ మీడియం స్కూల్, రెడ్డిగూడెం సహా అనేక ప్రాంతాల్లో భక్తులు పిల్లలు, ముల్లెలతో రోడ్లకు ఇరువైపులా నిరీక్షించారు. కొన్నిచోట్ల నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా అందక ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక అడవిలోనే ఉండిపోయారు.
తిరుగు ప్రయాణంలో భక్తుల తిప్పలు
మేడారం మహా జాతరలో అమ్మవార్లకు మొక్కులు అప్పగించి తిరుగు ప్రయాణం అయిన భక్తులకు బస్సులు దొరక్కపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అని నినాదాలు చేసి వారి ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఏ బస్సు ఎప్పుడు వస్తుందో..? ఎక్కడ ఆగుతుందో…? తెలియక పడిగాపులు కాశారు. ప్రభుత్వం మేడారంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను కల్పించడంతో విఫలమైందని, సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా బస్సులు లేకపోవడంతో మేడారం తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంటి బిడ్డలను సంకన వేసుకున్న తల్లుల నుంచి వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి చలిలో బస్సుల కోసం పడిగాపులు కాశారు. బస్సులను తాడ్వాయి మీదుగా పంపించాల్సి ఉండగా ట్రాఫిక్‌జామ్ సమస్యతో చింతల్ క్రాస్ రోడ్ నుంచి టపమంచ మీదుగా పస్రాకు మళ్లించారు. మేడారం జాతరలో కీలకంగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ అధికారులు భక్తులను గమ్యస్థలాలకు చేరవేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి.

07
సురేఖక్కా.. వీవీఐపీ పాస్ ఎందుకిచ్చినట్టు? ; మంత్రిని నిలదీసిన భక్తురాలు
వీవీఐపీ పాస్‌తో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను నిలదీశారు. మొక్కులు అప్పజెప్పేందుకు వచ్చి ఎదుర్కొన్న ఇబ్బందులు, పోలీసుల తీరును మంత్రికి వివరించారు. వివరాలిలా ఉన్నాయి. వీవీఐపీ పాస్‌తో ఓ భక్తురాలు కుటుంబసభ్యులలో కలిసి మేడారం వచ్చారు. భక్తుల తాకిడి కారణంగా వీవీఐపీ ప్రవేశమార్గాన్ని ఎత్తేయడంతో తల్లుల ప్రాంగణం వద్దకు వెళ్లేందుకు వీలుపడలేదు. దీంతో ఆమె కమాండ్ కంట్రోల్ రూమ్ మార్గం ద్వారా ప్రాంగణ పరిసరాల్లోకి ప్రవేశించింది. అప్పుడే మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు. అప్పటికే అసహనంతో ఉన్న భక్తురాలు.. మంత్రి సురేఖ వద్దకు వెళ్లి ‘వీవీఐపీ పాస్‌లు ఎందుకు ఇచ్చారు? దర్శనానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదేం పద్ధతి’ అంటూ ప్రశ్నించింది. మంత్రి భక్తురాలిని సముదాయించి ఆమె కుటుంబానికి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.