హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : దేవాలయం అనగానే దేవుడితోపాటు దైవసన్నిధిలో వినిపించే వేదపారాయణంతోనే ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ఆలయాల్లో అలాంటి వేదపారాయ ణం కరువైంది. పారాయణం చేసేందుకు వేదపండితులు ఉన్నా.. వారి వ్యక్తిగత పను ల కారణంగా విధులకు పంగనామం పెడుతున్నారు. రాష్ట్రంలో కమిషనర్లుగా సుందర్‌కుమార్, అనిల్‌కుమార్ పనిచేస్తు న్న సమయంలో ప్రధాన ఆలయాల్లో అంటే కమిషనర్, ఆర్జేసీ, డీసీ, 6ఏ ఆలయాలకు వాటి ఆదాయాన్ని బట్టి కేడర్స్ట్రెంత్ను నిర్ధారించారు. అదే సమయంలో వేదపారాయణం చేసేందుకు నాలుగు వేదాలకు సంబంధించి ఆలయాల స్థాయినిబట్టి ఇద్దరి నుంచి 8 మం ది వరకు నియమించారు. వారికి 261జీవో ప్రకారం ప్రభుత్వపరంగా జీతాలు చెల్లిస్తున్నారు.
వారు ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం వేళల్లో ఆలయాల్లో వేదపారాయణం చేయడంతోపాటు ఆలయానికి వచ్చే ముఖ్యమైన వ్యక్తులకు వేదాశీర్వచనంచేయాలి. 5 గంటలపాటు విధులు నిర్వర్తించాలంటూ వారికి కమిషనర్ ఉత్తర్వులు ఉన్నాయి. సాధారణంగా అర్చకుల విధులతో పోలిస్తే వీరి విధుల సమయం తక్కువే అయినా ఆ సమయంలో కూడా కొన్ని ఆలయాల్లో ఎవ రూ ఉండటం లేదు. ఇటీవల కార్తిక మాసం
లో చాలా ఆలయాల్లో వేదపారాయణమే జరగలేదని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. దేవాదాయశాఖతోపాటు గతంలో టీటీడీ కొందరిని నియమించింది. వారు కూడా సమయానికి రాకపోవడం.. వచ్చినా మొక్కుబడిగా పారాయణం చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆలయాల ఈవోలను, సూపరింటెండెంట్లను మేనేజ్చేస్తూ వేలకొద్దీ జీతం తీసుకుంటూ సొంత పనులు చేసుకోవడం తప్ప పారాయణం చేయడంలేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన జోగుళాంబ అర్చకులపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు.. వేదపండితులపై వచ్చిన ఫిర్యాదులపై మా త్రం పెద్దగా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయం పలు ఆలయాల అర్చకులు నేరుగా వేదపండితుల ను అడిగితే అధికారులకు లేని బాధ మీకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో వేదపండితుల విషయంలో జోక్యం చేసుకోబోమని అర్చకులు దేవాదాయ అధికారులకు చెప్పారు.
వేదపండితులు ఎట్టి పరిస్థితుల్లో 8గంటల పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ ఆలయంలో అధికారి ఒత్తిడి చేయడంతో ఆ వేదపండితులు స్థానిక ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దేవాదాయశాఖ ఇటీవలి ఉత్తర్వుల ప్రకారం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక, వేదపండితులెవరూ అనుమతి లేకుండా ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరాదు. నెలరోజుల పాటు ఈ ఉత్తర్వులను పాటించి ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. మంత్రి కొండా సురేఖ ఇంట్లోనే జరిగి న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు లేని ఆర్డర్ ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారని ఆలయాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ఆలయాల్లో టీటీడీ, దేవాదాయశాఖ నియమించిన వేదపండితులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.