ధర్మపురి : భక్తి శ్రద్ధలకు ప్రతీకగా నిలిచే ఓ సంఘటన ధర్మపురి క్షేత్రంలో చోటుచేసుకుంది. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేశ్- శారద దంపతులు.. తమ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేరుకున్నారు.
స్వామివారి మీద అపారమైన భక్తితో తమ మొక్కను నెరవేర్చుకునేందుకు వేకవజాము నుంచే సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. ఆలయానికి చేరుకున్న దంపతులను చూసిన భక్తులు వారిపై ప్రత్యేకమైన అభిమానం చూపించారు. వారి ప్రయాణం సందర్భంగా మార్గమధ్యలో భక్తులు వారికి నీళ్లు అందించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మాట్లాడుకుండా మౌనవ్రతంలోనే ఉండి మనసులో గోవిందనామ స్మరణతో మొక్కు తీర్చుకున్నారు.
వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న దంపతులు ప్రధాన దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణాన్ని మరింత పెంపొందింపజేసింది. స్వామివారి కృపతో తమ కోరికలు నెరవేరాలని ఆ భక్తులు ఈ విధంగా మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు.