e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home Top Slides సిటీ చుట్టూ రియల్‌ బూమ్‌

సిటీ చుట్టూ రియల్‌ బూమ్‌

సిటీ చుట్టూ రియల్‌ బూమ్‌
  • వ్యవసాయ భూముల ధరలకు రెక్కలు
  • రీజినల్‌ రింగ్‌రోడ్డు, పారిశ్రామిక ప్రగతితో జోరు
  • రెండునెలల వరకు రిజిస్ట్రేషన్లకు స్లాట్స్‌ బుకింగ్స్‌
  • నిత్యం కిటకిటలాడుతున్న తాసిల్దార్‌ కార్యాలయాలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్‌ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూముల్లో కాసుల పంట పండుతున్నది. రాష్ట్రప్రభుత్వ పారదర్శక పాలనతో భారీగా విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాంతాలకుతోడు హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ వలయ రహదారి (రీజినల్‌ రింగురోడ్డు) నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుండటంతో భూ క్రయవిక్రయాలు ఊహించనిస్థాయిలో జోరందుకున్నాయి. తాసిల్దార్‌ కార్యాలయాలు నిత్యం కిటకిటలాడుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో భూ రిజిస్ట్రేషన్‌ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శంకర్‌పల్లి మండలంలో ఇప్పటివకే 1,500 మందిస్లాట్లు బుక్‌ చేసుకొని వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. ఇక్కడ మే చివరి దాకా స్లాట్స్‌ దొరకని పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి.

దీంతో నగర శివారులో రియల్‌ వ్యాపారం మూడు పూవ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. గ్రామాల్లో భూముల చుట్టూ కార్లు షికార్లు కొడుతున్నాయి.వందకిలోమీటర్ల వరకూ భూమ్‌..
హైదరాబాద్‌ మహానగరం విస్తరిస్తున్న దరిమిలా వ్యవసాయేతర భూముల ధరలు ఆకాశాన్నంటడం సహజం. కానీ ఇప్పుడు నగరం చుట్టూ దాదాపు వంద కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములకూ మహర్దశ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలతో అంతర్జాతీయంగా పెట్టుబడుల వరద పారుతుండటంతో శివారు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి దూసుకుపోతున్నది. దీంతో కంపెనీలు వచ్చే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. రీజినల్‌ రింగురోడ్డు వ్యవసాయ భూములకు వరంలా మారింది. రింగురోడ్డు నిర్మాణం త్వరలోనే మొదలవుతుందని కేంద్రప్రభుత్వం ప్రకటించడంతోపాటు రాష్ట్ర సర్కారు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయించడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకున్నది.

కలిసొస్తున్న రహదారులు..

నగరం చుట్టూ వెళ్లే బీజాపూర్‌, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారులను అనుసరించి ఉన్న భూములకు గతంలో డిమాండ్‌ అధికంగా ఉండేది. ఇప్పుడు లోపలి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములకూ డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల కేంద్రాలు, గ్రామాలను అనుసరిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ రహదారి వ్యవస్థను మెరుగుపరిచింది. ఇప్పుడు చిన్నచిన్న గ్రామాలకు కూడా బీటీ రోడ్లు ఉన్నాయి. దీంతో కారు వెళ్లే రహదారి ఉంటేచాలు.. భూములను కొనుగోలుకు రియల్‌ వ్యాపారులు ఎగబడుతున్నారు.

రిజిస్ట్రేషన్ల జోరు ఇదీ..

చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో ధరణి ప్రారంభమైన గతేడాది నవంబర్‌ 2 నుంచి ఇప్పటివరకు 5,208 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మండలాల పరిధిలో మరో నెల వరకు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుకింగ్స్‌ ఖాళీగా లేవు. రోజూ ప్రతి తాసిల్దార్‌ కార్యాలయంలో గతంలో 20 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రద్దీ కారణంగా వాటి సంఖ్యను 30కి పెంచారు. అయి నా స్లాట్లు దొరకటంలేదు. ఈ మండలాల్లో ఏప్రిల్‌ చివరి వరకు రిజిస్ట్రేషన్ల కోసం 4,417 స్లాట్లు బుక్‌ అయ్యాయి. ఒక్క శంకర్‌పల్లిలోనే 1,500 స్లాట్లు బుక్‌ అయ్యాయి. అధికారులు రేయింబవళ్లు పనిచేసినా 2 నెలల వరకు స్లాట్స్‌ దొరకని పరిస్థితి. చందన్‌వల్లి పారిశ్రామికవాడ, వెల్‌స్పన్‌, అమెజాన్‌ డాటా సెంటర్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. వీటికితోడు శంకర్‌పల్లి పరిధి నుంచే రీజినల్‌ రింగ్‌రోడ్డు వెళ్తుండటంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రియల్‌ వ్యాపారులు,
పారిశ్రామికవేత్తలు పోటీపడి భూములను కొంటున్నారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌, మంచాల, యాచారం మండలాల్లోనూ రియల్‌ జోరు బాగా కనిపిస్తున్నది. ఇక్కడ ధరణి మొదలైనప్పటి నుంచి 3,743 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ప్రస్తుతం 20 రోజుల వరకు స్లాట్లు బుక్‌ అయినట్టు అధికారులు తెలిపారు. ఫార్మాసిటీ, ఏరోస్పేస్‌ పరిశ్రమల స్థాపనతో గతంలోనే ఈ ప్రాంత భూములకు బాగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు ట్రిపుల్‌ ఆర్‌ వస్తుండటంతో వ్యవసాయ భూముల రెక్కలొచ్చాయి. శ్రీశైలం- సాగర్‌ రాష్ట్ర రహదారుల మధ్య ఉన్న మంచాల, యాచారం మండలాల్లోని
భూములకు డిమాండ్‌ ఉన్నది. బీటీ రోడ్డు ఉంటే చాలు కోట్ల్లు పలుకుతున్నాయి.

షాద్‌నగర్‌ పరిధిలో ధరణి ప్రారంభం నుంచి 5,225 రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోకి వచ్చే ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్‌ మండలాల్లో దాదాపు 4 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ట్రిపుల్‌ ఆర్‌ ప్రకటనతో ఈ ప్రాంతాల్లోనూ భూముల విక్రయాలు ఊపందుకున్నాయి. తలకొండపల్లి పరిధిలో సాగునీటి సౌకర్యం ఉండటంతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

రిజిస్ట్రేషన్‌లు పెరుగుతున్నాయి

ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు బాగా పెరిగాయి. మొదట రోజుకు 10 రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండేది. తర్వాత 20కి పెంచారు. ప్రస్తుతం రోజుకు 30 రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు చేపట్టారు. అయినా రెండు నెలల వరకు స్లాట్లు బుక్‌ అయ్యాయి. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే విక్రేత పాస్‌బుక్‌ నుంచి కొనుగోలుదారుడి పాస్‌బుక్‌లోకి భూమి నమోదు చేస్తున్నాం. చుట్టుపక్కల పరిశ్రమలు రావడం, ట్రిపుల్‌ ఆర్‌ ప్రభావంతో భూ క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ధరణి పోర్టల్‌ రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నది.

అమరలింగంగౌడ్‌, షాబాద్‌ తాసిల్దార్‌, రంగారెడ్డి జిల్లా.

విపరీతంగా స్లాట్‌ బుకింగ్స్‌

ఇటీవల భూ లావాదేవీలు పెరిగాయి. ఒకవైపు పరిశ్రమలు రావడం మరోవైపు ట్రిపుల్‌ ఆర్‌ ప్రభావంతో రిజిస్ట్రేషన్లు పెరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడంతో రైతులు, భూ కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం చాలారోజుల వరకు ముందుగానే స్లాట్స్‌ బుక్‌ అవుతున్నాయి. సరాసరి వారం నుంచి కొన్ని సందర్భాల్లో 20 రోజుల వరకు కూడా స్లాట్స్‌ ముందుగానే బుక్‌ అవుతున్నాయి.

వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం తాసిల్దార్‌, రంగారెడ్డి జిల్లా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిటీ చుట్టూ రియల్‌ బూమ్‌

ట్రెండింగ్‌

Advertisement