BRS MLC Kavitha | ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అందరితో సమానంగా దళితులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పలు మాదిగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వారు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ `దళిత బంధు`తో వచ్చిన ఆర్థిక సాయంతో చేస్తున్న వ్యాపారాలకూ `దళిత రక్షణ నిధి` పేరిట బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఒకసారి పథకాన్ని మొదలుపెడితే శాశ్వతంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మెడికల్ షాపుల స్థాపనలోనూ ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఎప్పుడూ కుల వివక్ష చూపించలేదని, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కులం కన్నా గుణం గొప్పదని, మతం కన్నా మానవత్వం గొప్పదని తాము విశ్వసిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాదిగ భవన్ కోసం ఎకరం స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని, దానికోసం రూ. కోటి ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే పనులు మొదలుపెడుతామని చెప్పారు.
మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ అని, సీఎం కేసీఆర్‌తోనే తమ బతుకులు మారాయని స్పష్టం చేశారు. దళిత బంధు వల్ల తాము ఆర్థికంగా ఎదిగామని, అందరితో సమానంగా తమను నిలబెట్టారని, తమ జీవితాల్లో వెలుగులు నింపారని వివరించారు. దళిత బంధుతో దళితులకు సీఎం కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిగ సామాజికవర్గం ముందు వరుసలో ఉందని మాదిగ సంఘాల నాయకులు చెప్పారు. ఆంధ్రా పాలకుల బానిస బతుకుల నుంచి తెలంగాణను సీఎం కేసీఆర్ విముక్తి చేశారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం సఫాయి కార్మికులను పట్టించుకోలేదని, కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారని చెప్పారు. దళితుల్లో ప్రతీ కుటుంబానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్‌కు మద్ధతిస్తామని, బీఆర్ఎస్ ను తప్పకుండా గెలిపిస్తామని ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మత్స్య సొసైటీలు నిర్వీర్యమయ్యాయని, సీఎం కేసీఆర్ వాటిని సరిద్దిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గతంలో కాంట్రాక్టర్లు చెరువుల్లో చేప పిల్లలను వేసేవారని, ఇప్పుడు కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతోందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ముదిరాజ్ కుల సంఘం నేతలు మంగళవారం ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సొసైటీల ఏర్పాటు, నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఫిషింగ్, మార్కెటింగ్ కు వేర్వేరు సొసైటీల ఏర్పాటు విషయంలోనూ ఆలోచన చేయాలన్నారు. ముదిరాజ్‌లతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఆ వర్గం హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తానన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముదిరాజ్ భవనం నిర్మాణానికి భూమి, నిధులు మంజూరు చేసేలా చొరువ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వృత్తి పనుల వారికి సీఎం కేసీఆర్ చాలా తోడ్పాటును అందిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ వల్లే హైదరాబాద్ ఇంత స్థాయిలో అభివృద్ది సాధించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అందు వల్లే హైదరాబాద్ నగరానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కంపెనీలు నిజామాబాద్కూ వస్తాయని చెప్పారు. ఇప్పటికే నిజామాబాద్ ఐటీ హబ్ కు ఐటీ కంపెనీలు వచ్చాయని వివరించారు. జిల్లాకు ఆయా రంగాల పరిశ్రమలు కూడా వస్తాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనకు జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు రెడ్డిక కుల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. బోధన్‌లోని రెడ్డిక కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, పర్దె రాజు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు మంగళవారం నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశామని, ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వైపే ఉంటామని కుల సంఘాల నేతలు తేల్చిచెప్పారు. గతంలో ఏ పార్టీ కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో తమ వర్గానికి చెందిన విద్యార్థులకు సీట్లు లభించాయని తెలిపారు. రూ. 50 లక్షలతో తమ ప్రాంత దేవాలయానికి రోడ్డు వేయించినందుకు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించినందుకు రెడ్డిక కులస్తులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనుల గురించి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. కుల సంఘం ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై కవిత సానుకూలంగా స్పందించారు. కమ్యునిటీ భవనాల నిర్మాణానికి తాను చొరవ తీసుకుంటానని అన్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరారు. మంగళవారం ఇందూరు యువ గర్జన పేరిట నిర్వహించిన బీఆర్ఎస్ యూత్ సభలో నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పెద్ద సంఖ్యలో యువకులు పార్టీలో చేరారు. నిజామాబాద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకేశ్ బింగి, కన్నా హిందూ వాహిని యూత్ అసోసియేషన్ ప్రతినిధులు మున్నా, ఫన్నీ, వివేకానంద యూత్ టౌన్ అధ్యక్షుడు సన్నీ గౌడ్, ఎస్టీ యూత్ నుంచి పవన్‌తో పాటు సందీప్ చుక్క, వసీమ్, జాకి, జేకే సులేమాన్, ఇమ్రాన్, ఇర్ఫాన్, ఆసిఫ్, జహీద్, అహద్, షేజాన్, అజీజ్ లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కవిత ఆహ్వానించారు. బీఆర్ఎస్ నేతలు చిన్నూ గౌడ్, రేహాన్ నేతృత్వంలో వారు బీఆర్ఎస్ లో చేరారు.
బోధన్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీజేపీ జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు, యువ నాయకుడు తిరుపతి హన్మండ్లు (బుజ్జి), కాంగ్రెస్ సీనియర్ నాయకులు- వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అభిద్ అలీ, మాజీ కౌన్సిలర్ మీర్ వాహెద్ అలీ మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.