హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో హైదరాబాద్‌లో ఆఫీస్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని, ఐటీ సంస్థల విస్తరణకు మరింత ఊపునిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పాలసీ వల్ల వచ్చే ఐదేండ్లలో హైదరాబాద్‌లో 35 – 40 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. గ్రిడ్ పాలసీలో భాగంగా నగరానికి ఉత్తర, తూర్పు దిశల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగానే ఉత్తర దిక్కున కొంపల్లిలో ఐటీ టవర్ నిర్మాణం, ఉత్తర-పశ్చిమ దిక్కున కొల్లూరులో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నది. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉన్న 11 పారిశ్రామిక వాడలను ఎంపిక చేసి ప్రభుత్వం వాటిని ఐటీ పార్కులుగా మార్చాలని నిర్ణయించింది. 200 ఎకరాల వరకు అభివృద్ధి చేసిన స్థలంలో 50 శాతం ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేటాయించి, మిగిలిన 50 శాతం నివాస, ఇతర వాణిజ్య అవసరాలకు అభివృద్ధి చేసుకొనే వీలు కల్పించింది. ప్రస్తుతం నగరానికి పశ్చిమాన ఐటీ కార్యాలయాలు ఎక్కువై, ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఐటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఫలితంగా తక్కువ ధరకే ఆఫీస్ స్పేస్ దొరికి, ఐటీ కంపెనీలు భారీగా తరలివచ్చే అవకాశం ఏర్పడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రిడ్ పాలసీపై జేఎల్ఎల్ రిసెర్చ్ హెడ్, చీఫ్ ఎకనామిస్ట్ సమంతక్ దాస్ ప్రశంసలు కురిపించారు. ఈ పాలసీ వల్ల హైదరాబాద్‌లో ఐటీ రంగానికి మరింత ఊపు వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఐటీ మంత్రి కేటీఆర్ పలువురు ఐటీ దిగ్గజ సంస్థల అధిపతులతో భేటీ అయ్యి హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. తూర్పున ఉప్పల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు గ్రోత్ కారిడార్ వరకు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా ముందుకు సాగుతున్నదని వెల్లడించారు.
ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ హవా
2016 – 2021మధ్య 81 శాతం గ్రేడ్-ఏ ఆఫీస్ స్టాక్‌ను వృద్ధి చేయడం ద్వారా దేశంలోనే వేగంగా ఆఫీస్ స్పేస్ వృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ కీర్తి గడించింది. 34.7 మిలియన్ చదరపు అడుగులను జోడించడం ద్వారా గ్రేడ్-ఏ స్టాక్‌లో దేశంలో 12.7 శాతం వాటాను ప్రస్తుతం హైదరాబాద్ కలిగి ఉన్నది. కరోనా తగ్గినందున పలు కంపెనీలు విస్తరణకు సిద్ధమవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ ఏర్పడుతుందని టాటా రియాల్టీ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అభిప్రాయపడ్డారు. దాన్నిబట్టి కంపెనీలకు కావాల్సిన ఆఫీస్ స్పేస్ అందించటంలో హైదరాబాద్ ప్రముఖ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
ఐటీ కంపెనీలకు గ్రిడ్ పాలసీ ప్రోత్సాహకాలు
పరిశ్రమలకు వర్తిస్తున్న విద్యుత్తు చార్జీలకు అదనంగా ప్రతి యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేండ్ల పాటు ఏటా గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు రీయింబర్స్మెంట్ ఇస్తారు.
అద్దెలో 30 శాతం వరకు ఐదేండ్ల పాటు ఏటా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు.
ప్రస్తుతం ఉన్న కంపెనీలు అదనపు స్పేస్ నిర్మించుకొంటే ఈ ప్రోత్సాహకాలు ప్రో-రేటా పద్ధతిలో వర్తింపజేస్తారు.
500, అంతకన్నా ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కనీసం మూడేండ్ల పాటు అదనపు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. వీటిని యాంకర్ యూనిట్లుగా పేర్కొంటున్నారు.
పాలసీలో భాగంగా జెన్‌ప్యాక్ట్, రాంకీ ఎస్టేట్స్.. ఉప్పల్‌లోని జెన్‌ప్యాక్ట్ ప్రాంగణంలో 14 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఒప్పందం చేసుకొన్నాయి. 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను జెన్‌ప్యాక్ట్ కోసం, 9 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ను నివాసాల కోసం నిర్మించనున్నారు.