వరంగల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరానికి సమీపంలో మరో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతున్నది. గొప్ప జీవ వైవిధ్యం ఉన్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరులోని నాలుగు వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో ఈ పనులు మొదలవుతున్నాయి. తొలిదశలో రూ.4 కోట్లతో పనులు చేపట్టేందుకు కుడా ఇటీవలే టెండర్లు పిలిచింది. మొత్తం పనులు పూర్తయితే దేవునూరు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారనున్నది. జలవనరులు, వేల రకాల చెట్లు, వందల రకాల జంతువులు, పక్షులు, ఇతర జీవాలతో గొప్ప జీవ వైవిధ్యం ఇక్కడ ఉన్నది. గుట్టల మధ్య ధర్మసాగర్ రిజర్వాయర్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. దశల వారీగా అన్ని వసతుల కల్పనతో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చేలా కుడా పనులు చేపడుతున్నది. ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు, నైట్ హాల్ట్ కేంద్రాలను నిర్మించనున్నారు.
రిజర్వాయర్ నుంచి దేవునూరు గుట్టల వరకు రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు, ఇతర మార్గాలైతే అటవీ ప్రాంతానికి, జీవ వైవిధ్యానికి ఇబ్బందులు ఉంటాయనే కారణంతో రోప్ వేను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ చుట్టూ గుట్టలు ఉంటాయి. రిజర్వాయర్ మధ్యలో కాటేజీలను నిర్మించనున్నారు. అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఇప్పటికే వనదర్శిని విజ్ఞానయాత్రలు, బర్డ్‌వాక్, ఫారెస్ట్వాక్ వంటి పర్యావరణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ట్రెకింగ్, నైట్ క్యాంపింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి నుంచి ఆరు కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.