హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వీ బాలకిష్టారెడ్డి అన్నారు. అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ‘ఉద్యానరంగంపై పర్యావరణ మార్పులు’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రానున్న 20, 30 ఏండ్లపాటు కచ్చితంగా పర్యావరణ మార్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు.
అందుకు అనుగుణంగా పర్యావరణ నాణ్యతను కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ఎర్త్ సమ్మిట్, ఈఎన్ఎఫ్ఎస్సీ, యూఎన్ఈపీ తదితర చట్టాలకు అనుగుణంగా దేశంలోని 42 రకాల నియమాలను అందరూ పాటించాలని సూచించారు. పర్యావరణం మార్పులను త్రట్టుకునే దీటైన కార్యక్రమాలు స్థానికంగానే రావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అందరూ కలిసికట్టుగా ఈ కర్తవ్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతీ పంటకు పర్యావరణ మార్పులు, వాటి ప్రభావాన్ని తట్టుకునే అంశాలు, మ్యాపింగ్ చేయాలని ఉద్యాన వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి చెప్పారు. వాతావరణ ఆధారిత ఉద్యాన, వ్యవసాయ సలహాలను రైతులందరికీ చేర్చేలా విస్తరణ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.