Stethoscope | హైదరాబాద్: స్టెతస్కోప్ సాయంతో మూగవారి భావాలను మాటలుగా మార్చగలిగే అధునాతన సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్(ఎస్ఎస్ఐ)ను ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్లు రామనాథన్ సుబ్రమణియన్, వినీత్ గాంధీ నేతృత్వంలో నీల్ షా, నేహ సహిప్జాన్ ఈ వినూత్న సాంకేతికతను తయారు చేశారు. సాధారణంగా సైలెంట్ స్పీచ్ ఇంటర్ఫేస్ కోసం లిప్ రీడింగ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. అల్ట్రాసౌండ్ టంగ్ ఇమేజింగ్, రియల్ టైమ్ ఎంఆర్ఐ, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఆర్టికులోగ్రఫీ వంటి ఇతర సాంకేతికతలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. ట్రిపుల్ఐటీ హైదరాబాద్ పరిశోధకులు తయారుచేసిన ‘స్టెతోటెక్స్ కార్పస్’ వీటికి భిన్నమైనది. ముందుగా పరిశోధకులు వేర్వేరు ప్రదేశాల్లో మనుషులు మాట్లాడేటప్పుడు వారి గొంతులో కలిగే వైబ్రేషన్స్‌ను, మాటలను రికార్డు చేశారు. తర్వాత ఈ వైబ్రేషన్స్‌ను మాటలుగా మార్చే ఒక మాడల్‌ను తయారుచేశారు. మూగవారు మాట్లాడేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్‌ను సాధారణ స్తెతస్కోప్ గుర్తించి బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు చేరుతాయి. పరిశోధకులు అభివృద్ధి చేసిన మాడల్ ఇన్స్టాల్ అయిన ఉన్న ఫోన్ ఈ వైబ్రేషన్స్‌ను ఎప్పటికప్పుడు మాటలుగా మార్చేస్తుంది.