హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్కార్డులు అందేలా విధివిధానాలు రూపొందించాలని ఐఅండ్‌పీఆర్ అ ధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను తక్షణమే రూపొందించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జర్నలిస్టులకు సంబంధించి అక్రెడిటేషన్, హెల్త్‌పాలసీ, అవార్డులు, జర్నలిస్టులపై దాడులను అరికట్టడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీల్లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.