హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రముఖ ఆలయాల ప్రసాదాలను టెస్టింగ్ కోసం ల్యాబ్‌లకు పంపించింది. ఇక మీదట ఆలయాల్లో ప్రసాదాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హన్మకొండ భద్రకాళి తదితర ఆలయాల్లో ప్రసాదం కోసం వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షలకు హైదరాబాద్‌లోని ల్యా బ్‌కు పంపినట్టు అధికారవర్గాలు తెలిపాయి. యాదాద్రిలో మదర్ డెయిరీ నెయ్యిని వినియోగిస్తుండగా, మిగిలిన ఆలయాల్లో స్థానికంగా లభ్యమయ్యే నెయ్యినే వాడుతున్నారు. యాదాద్రి ప్రసాదాలను టెస్టింగ్‌కు చర్లపల్లి ల్యాబ్ కు పంపినట్టు ఈవో భాస్కర్ రావు తెలిపారు. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈవో రమాదేవి పేర్కొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి కరీంనగర్ డెయిరీని వినియోగిస్తున్నారు.