Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఇంకా వరద ముంపులోనే ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, ముగ్గురు మంత్రులు అక్కడే తిష్టవేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు మెరుగుపడలేదని, తమకు సహాయం అందలేదని బాధితులు ఆక్రోశిస్తున్నారు. సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 31 మంది వరకు మరణించినట్టు చెప్తున్నారు. 16 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. ్ల 5,700 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు పంచాయతీరాజ్‌శాఖ తెలిపింది.
117 గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు. 150 ప్రాంతా ల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, 500 రోడ్లు భారీగా దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లక్షన్నర ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని వ్యవసాయశాఖ అధికారులు చె ప్తుండగా, 4-5 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందనే అంచనాలు ఉన్నాయని, సమగ్ర సర్వే చేయాలని సీఎం చెప్పడం గమనార్హం.
రాష్ట్రంలో వరద ముంపునకు, ప్రాణనష్టానికి ప్ర భుత్వ వైఫల్యమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తున్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, ఏపీ, తెలంగాణకు వర్ష ముప్పు పొంచి ఉన్నదని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించింది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఒక జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నదో కూడా అంచనాలు ఇస్తుంటారు. దీనిని బట్టి ముంపు ప్రాంతం ఎక్కడ ఉంటుందో, వరదలు ఎక్కడ సంభవించే అవకాశం ఉన్నదో ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉంటుంది.
అయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. గతంలో వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, ఫైర్ తదితర వ్యవస్థలను అప్రమత్తం చేసి రక్షణ చర్య లు చేపట్టేవారని, ఎక్కడ చిన్న వరద, వాన వచ్చినా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాఫ్టర్లను రంగంలోకి దించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంతోపాటు ఇద్దరు మంత్రులున్న ఖమ్మం జిల్లా లో సహాయక చర్యలకు ఒక్క హెలికాప్టర్ కూడా రా లేదని ఉదహరిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి వరదల వేళ బురద రాజకీ యం చేస్తుండటంపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్రంలో వరద ప్రభావం మొదలైన సంగతి తెలిసిందే. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఎక్కడా బయట కనిపించలేదు. కనీసం సచివాలయానికి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. మంత్రులకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రకటనలు విడుదల చేశారు. సోమవారం ఉదయం మాత్రం హడావుడిగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లి సమీక్ష నిర్వహించారు. తర్వాత సూర్యాపేట, ఖమ్మం పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. ఆదివారమే ఎందుకు ప్రత్యక్షంగా పర్యవేక్షించలేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇక సో మవారం సూర్యాపేటలో సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పట్టించుకోకుండా, అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను విమర్శించా రు. దీంతో ‘వరదల వేళ బురద రాజకీయం ఏమి టి?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఖ మ్మం పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండు వా వేసుకోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ప్రెస్‌మీట్ సమయంలో అందంగా అలంకరించిన వేదికపై కూర్చోవడం, కాంగ్రెస్ ప్రచార రథంలో సీఎం, మంత్రులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూస్‌నెట్‌వర్క్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదలతో 33 మంది వర కు దుర్మరణం చెందినట్టు అనధికారికంగా తెలిసింది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 మంది మృత్యువాతపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 మంది చనిపోయారు. ఫోన్లు చేసినా కాపాడేవారులేక వరదల్లో కొట్టుకుపోయినవారే అత్యధికంగా ఉన్నారు. నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
అచ్చంపేటరూరల్, సెప్టెంబర్ 2: చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది చెంచులు దుందుభి నదిలో చిక్కుకున్న ఘటన సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండ లం బొమ్మనపల్లి సమీపంలోని గుర్రలబండ వద్ద చోటుచేసుకున్నది. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన తొమ్మిది మంది చెంచులు సోమవారం గుర్రలబండ వద్ద ఉన్న దుందుభి నదిలోకి చేపల వేటకు వెళ్లారు. నదిలో నీటి ఉధృతి పెరగడంతో అందులో చిక్కుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ యువకుల సహకారంతో సోమవారం సాయంత్రం డ్రోన్లతో ఆహార పదార్థాలు అందించారు. మంగళవారం ఉదయం చెంచులను బయటకు తీసుకొస్తామని డీఎస్పీ తెలిపారు.