మానకొండూర్ రూరల్/బెజ్జంకి, జనవరి 21 : రుణమాఫీపై కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను రైతులు నిలదీశారు. మంగళవారం దేవంపల్లిలో గోదాం ప్రారంభోత్సవంలో మాట్లాడుతుండగా.. తమకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు కలవేని బక్కయ్య, దాడి కొమురయ్య నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని బ్యాంకులు అప్డేట్ కాలేదని, వాటి నుంచి రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించ లేదని, అందుకే అక్కడక్కడా కొందరు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పారు.
అప్పుల భారం పెరిగినందున కొన్ని పథకాలకు కోతలు పెడుతున్నామని అన్నారు. దాడి కొంరమ్మ అనే మహిళ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి పింఛన్ రూ. 4 వేలు ఇస్తామని చెప్పిండ్రు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించింది. ఆమెకూ ఎమ్మెల్యే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే చెప్పాడు.
రైతు భరోసా కింద రూ.12 వేలు ప్రకటించడంపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌లో జరిగిన గ్రామసభలో రైతు చిలువేరు బుచ్చిరెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను నిలదీశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరాలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం సరికాదని నిరసన తెలిపాడు. 420 మందిలో 130 మందికే రుణమాఫీ జరిగిందని తెలిపారు.