హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని జలసౌధలో గురువారం జరిగిన ఎస్ఎల్ఎస్సీ సమావేశంలో దేవాదుల, కాళేశ్వరం ప్యాకేజీ-16, ఎల్లంపల్లి ప్రాజెక్టుల రివైజ్డ్ అంచనా వ్యయాలపై చర్చించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ అంచనాలను రూ.15 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు చేశారు.
దీనిపై కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పెరిగిన అంచనా వ్యయాలను ఇవ్వాలని ఎస్ఎల్ఎస్సీ చైర్మన్ అనిల్ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీని రూ.100 కోట్లు అదనంగా చూపించగా, ప్యాకేజీల వారీగా అంచనాలు ఇవ్వాలని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ-16లో బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి చిట్యాల వరకు కాల్వ పనులకు సంబంధించి రూ.40 కోట్ల మేర డ్యూ టీని ఎకువగా చూపించారని, అది ప్రాక్టికల్‌గా సరిగా లేదని, దానికి జస్టిఫికేషన్ ఇచ్చి ప్రతిపాదనలను పంపాలని అధికారులను ఆదేశించారు.