హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో తదుపరి కార్యచరణపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల కమిటీకి అందించాల్సిన సమాచారాన్ని టీఎస్ఆర్టీసీ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం విదితమే. దీంతో ఏపీలో ఆర్టీసీ విలీనానికి అనుసరించిన మార్గదర్శకాలపై అధ్యయనం చేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు.. ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.
విలీన ప్రక్రియకు సంబంధించిన గెజిట్, జీవో జారీ జరిగిన వెంటనే ఈ సమాచారాన్ని మార్గదర్శకాల కమిటీకి అందజేయనున్నారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఉన్న 43,373 మంది అధికారులు, కార్మికులు, సిబ్బందికి సంబంధించిన హోదా, వేతనాలు, వారి బ్యాంకు అకౌంట్లు, ఆధార్, పాన్ నంబర్లు తదితర వివరాలను ఆర్థిక శాఖకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వారి క్యాడర్ను ఖరారు చేస్తుందని తెలిపారు. క్యాడర్ గుర్తింపు పూర్తయ్యాక వేతనాల నిర్ధారణ జరుగుతుందని, ఆ తర్వాత జిల్లాల వారీగా క్యాడర్ కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని వివరించారు.