జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని పలిమెల గ్రామంలో పేదల భూమి దక్కన్ సిమెంట్స్‌కు కేటాయించడంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ‘మరో లగచర్ల.. పలిమెల’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.
పలిమెలలో రైతుల భూముల రిజిస్ర్టేషన్‌పై అధికారులు విచారణ సాగిస్తున్నారు. 2008లో పలిమెలలో రైతులు కాస్తులో ఉన్న భూములను మంథని, ధన్వాడ, లద్నాపూర్ తదితర గ్రామాల నేతలు రిజిస్ర్టేషన్ చేయించుకుని ఇప్పుడు గుట్టుగా దక్కన్ సిమెంట్ సంస్థకు కట్టబెట్టారు.
అసలు దక్కన్ సంస్థ ఇక్కడికి ఎలా వస్తుంది? వెనుక సూత్రధారులు ఎవరు? భూముల రిజిస్ర్టేషన్ చేయిస్తున్నది ఎవరు? తహసీల్దార్ తన కార్యాలయంలో కాకుండా ఇతరచోట రిజిస్ర్టేషన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? తెర వెనుక ఎవరున్నారు? అని అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ రైతులతో చర్చలు జరిపి వివరాలు సేకరించి తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలను కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిసింది. దీంతో తహసీల్దార్‌పై విచారణ, చర్యల బాధ్యతలను సీసీఎల్ఏకు అప్పగించారు.