Suryapeta | సూర్యాపేట : జోరు వాన.. పోటెత్తిన్న వరద.. ఊరంతా తడిసి ముద్దయ్యింది. కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా అంధకారం ఏర్పడింది. అలాంటి సమయంలో గ్రామస్తుల అవస్థలు చూడలేక ఒక ఎలక్రిక్టల్ హెల్పర్ సాహసం చేసి చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభానికి మర్మమతులు చేసి కరెంట్ సరఫరాను పునరుద్ధరించాడు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్‌లో గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆ హెల్పర్ పేరు సంతోష్ గౌడ్. సోషల్ మీడియాలో అతనికి అభినందనలు వెల్లువెత్తున్నాయి. వర్షాల నేపథ్యంలో గురువారం పాతర్లపహాడ్ గ్రామానికి కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెరువు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం మీద సమస్య తలెత్తినట్టు లైన్‌మన్ కింద హెల్పర్‌గా పని చేస్తున్న సంతోష్ గౌడ్ గుర్తించాడు. విపత్కర పరిస్థితుల్లోనూ సాహసం చేసి చెరువులో ఈదుకుంటూ వెళ్లి, మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి దెబ్బతిన్న తీగకు మరమ్మతులు చేశాడు. గ్రామం మొత్తానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గ్రామస్తులతోపాటు ఇతరులు కూడా సంతోష్ సేవలకు సలామ్ చెప్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తన ఫేస్బుక్లో ఆ వీడియోను పోస్ట్ చేసి సంతోష్ సాహసాన్ని, వృత్తి పట్ల నిబద్ధతను అభినందించారు.