ధర్మారం, మార్చి 4: మోదీ పాలనతో విసిగిపోయిన దేశప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి కావాలని కోరుకొంటున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ధర్మారం, నంది మేడారం, దొంగతుర్తి గ్రామాల్లో పర్యటించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్వల్పకాలంలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రజలు సీఎం కేసీఆర్ నాయత్వాన్ని కోరుకొంటున్నారని చెప్పారు. దేశంలో అన్ని వనరులున్నా వాడే శక్తి, సత్తా లేకపోవడం, కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం లేకపోవడంతో దేశాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఈ క్రమంలో దేశానికి కేసీఆర్ వంటి గొప్ప నాయకుడి నాయకత్వం కావాలనే ఉద్దేశంతో వివిధ రాష్ర్టాల నాయకులు ఆహ్వానం పలుకుతున్నారని కొప్పుల పేర్కొన్నారు.